హైదరాబాద్ పార్కింగ్ యాప్

   hpalogo
Sakshi | Updated: October 13, 2014 23:26 (IST)

క్రాంతికుమార్‌ను హ్యాకథాన్‌లో గెలిపించిన ప్రాజెక్ట్.. హైదరాబాద్ పార్కింగ్ యాప్. క్రాంతికుమార్ స్వస్థలం ఖమ్మం. తల్లిదండ్రులు కమల, సులోచనరావు. కంప్యూటర్ గేమ్స్ టెక్నాలజీలో యూకే యూనివర్శిటీలో ఎమ్మెస్ చేసొచ్చాడు. అక్కడే ఎడిన్‌బర్గ్‌లో కొన్నాళ్లు పనిచేసొచ్చి బెంగళూరు ఐబీఎంలో చేరాడు. తర్వాత ‘పర్‌ఫెక్ట్ 12’ అనే సొంత కంపెనీ స్థాపించాడు. ఈ యాప్ తయారీలో తనను ఏ ఆలోచన నడిపించిందో క్రాంతి చెబుతూ.. ‘నేను కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను.

ఓ రోజు పేపర్లో ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌లో స్థలం లేక పనికోసం అక్కడికి వచ్చిన వాళ్లంతా తమ వాహనాలను రోడ్డుమీదే నిలుపుతున్నార’నే వార్త చదివాను. పార్కింగ్ స్థలాలు నిర్వహించే జీహెచ్‌ఎంసీకి పార్కింగ్ స్థలం లేకపోవడమేంటి ?. హైదరాబాద్ నడిబొడ్డున స్థలం లేదు. ఉన్న స్థలాన్ని ఎలా వాడుకోవచ్చనే ఆలోచన నుంచే ఈ యాప్ పుట్టింది. ముందుగా హైదరాబాద్ పరిధిలో ఎన్ని వాహనాలున్నాయి? నిత్యం ఎన్ని కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి? జీహెచ్‌ఎమ్‌సీ నిర్వహణలో ఉన్న పార్కింగ్ స్థలాలెన్ని.. ఇలా లెక్కలన్నీ తీశాను. జీహెచ్‌ఎంసీ 47 పార్కింగ్ స్థలాలను మాత్రమే నిర్వహిస్తుందని తేలింది. అంతే నా హెచ్‌వైడీ పార్కింగ్ యాప్ తయారీకి బీజం పడింది’ అని వివరించారు.

ఎలా పనిచేస్తుందంటే..
మీ ఇంటి దగ్గర గానీ, మీ షాప్ ప్రాంగణంలో గానీ, సిటీలో ఇంకెక్కడైనా గానీ మీకు ఖాళీ స్థలం ఉంటే ఆ ప్రదేశాన్ని కార్పొరేషన్‌కి ఇవ్వదలిస్తే ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ మెసేజ్ నేరుగా జీహెచ్‌ఎంసీ అధికారులకు వెళ్తుంది. వారు మిమ్మల్ని సంప్రదించి ఆ స్థలాన్ని పార్కింగ్‌కి ఇచ్చేట్టుగా మీకు అనుమతి మంజూరు చేస్తారు. అంతేకాదు మీరు పార్కింగ్ నిర్వహించదలచుకుంటే కూడా ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఈ పార్కింగ్ స్థల సమాచారం ఈ యాప్ ఉపయోగించే వారికి తెలుస్తుంది. అబిడ్స్ వంటి రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. వాహనదారులకు ఆ ప్రదేశానికి దగ్గర్లోని పార్కింగ్ ప్లేసెస్ అన్ని ఈ యాప్ చూపిస్తుంది.

ఇంకా చెప్పాలంటే నగరంలోని పార్కింగ్ ప్లేసెస్ సమస్త సమాచారం యాప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పటికే ఇది 300 పైగా పార్కింగ్ స్థలాలను గుర్తించింది. అనుమతిలేని చోట్ల పార్కింగ్ దందా చేస్తున్న వాళ్ల మీదా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. ఇది త్వరలోనే నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ‘రానున్నది స్మార్ట్ సిటీ కాలం. దీన్ని దృష్టిలోపెట్టుకొనే నగరాల్లోని రిటైల్ స్టోర్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ మొదలైన వాటికి ‘స్మార్ట్ సొల్యూషన్’ అనే కాన్సెప్ట్‌పై రీసెర్చ్ చేస్తున్నాను. మొబైల్ యాప్సే కాకుండా వెబ్‌యాప్స్, సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్.. ఇట్లా అన్ని సొల్యూషన్స్ మీదా వర్క్ చేస్తున్నాను’ అని క్రాంతికుమార్ తెలిపారు.

టాగ్లు: క్రాంతికుమార్‌, హైదరాబాద్ పార్కింగ్ యాప్, కంప్యూటర్ గేమ్స్ టెక్నాలజీ, సిటీప్లస్, kranthi kumar, hyderabad parking aap, computer games technology, cityplus